27, ఏప్రిల్ 2017, గురువారం

***బాల్యంలో నా జ్ఞాపకం..***

               ***బాల్యంలో నా జ్ఞాపకం..***
నమ్ముతారో లేదో కానీ అమ్మ,నాన్న ఇద్దరూ కలిసి ఎలా నేర్పేశారో మరి..నాలుగేళ్ళకే అక్షరాలు గుర్తుపట్టి చదివే దాన్ని.చందమామ నా చేతిలో ఉంచుకునే నిద్రలోకి జారుకునేంత ప్రాణంగా ఉండేదాన్నిట.పదాలు,వాక్యాలు,పేరాలు,పేజీలు..పుస్తకం పట్టుకుని గడగడ చదువుకుపోతుంటే అందరూ ముచ్చటపడేవాళ్ళుట.ఇంకో ఏడాదికి రాయడం కూడా వచ్చేసింది..కానీ ఎడమచేతితో..
అలాంటి నాకు కష్టం బడిలో చేరే రూపంలో ముంచుకొచ్చింది.మాష్టారు పలకమీద అ,ఆ అనీ పలక తిప్పి ఇ,ఈ అనీ రాసిచ్చి దిద్దమన్నారు.నేను ఎడమచేత్తో బలపం పట్టుకున్నా.ఎడమచేతి మీద బెత్తం దెబ్బ పడింది చుర్రుమంటూ..బలపం కుడిచేతిలోకి మార్చుకోమని కళ్ళెర్రజేస్తున్నారు మాష్టారు.కళ్ళనీళ్ళు కారిపోతుండగా రాయడం ప్రయత్నిస్తున్నా.కుదరట్లేదు.దిద్దకుండా దిక్కులు చూస్తున్న నాకు ఈ సారి వీపు మీద పడింది దెబ్బ ..
కొత్తపిల్లల్ని బెదరగొట్టకండి మాష్టారూ! ఇంకో టీచర్ వారిస్తోంది దేవతలా.
ఇంతలో హడావిడిగా నాన్న వచ్చారు..దేవుడు దిగివచ్చినట్లు.
"మా పాప రాధిక ను చేర్చామండీ ఈ రోజు..మా ఆవిడ నేను చెప్పాననుకుని చెప్పలేదుట.అమ్మాయికి రాయడం,చదవడం వచ్చు.మళ్ళీ అక్షరాలు దిద్దించకుండా ఇంకేమైనా నేర్పండి చాలు." అన్నారు.
"లేదండీ ఏం రాయలేకపోతోంది".అన్నారు మాష్టారు.పాపం నాన్న  తెల్లమొహమేశారు."భయమేమోనండీ..ఏమ్మా! 5 పూల పేర్లు రాయి." అన్నారు.నేను ఎడమచేత్తో గబగబా రాయగానే మాష్టారు ఫెళ్ళున నవ్వి "పురచేతివాటమా! మరి చెప్పరేం? అలవాటు మార్పించండి ఓ వారంలో" అన్నారు.ఆ వెక్కిరింత నాలో బడి అంటే అయిష్టాన్ని నాటింది.
"తెలివైన పిల్లండీ..కొంచెం మెల్లిగా చెప్పండి.." అని నాన్న వెళ్ళిపోగానే మాష్టారు నా కేసి తిరిగి "గడగడా చదివేస్తావుట..ఏదీ? పుస్తకం పట్టుకురా." అన్నారు. ఇంతలో గంట మోగింది.ఇంటికి పరుగెత్తా సంచి తగిలించుకుని. అన్నం తిని మళ్ళీ వెళ్ళమనగానే ఏడుపు మొదలెట్టా.అమ్మ బుజ్జగించి " నీకు పుస్తకాలు చదవడం వచ్చు కదా! చదువుకో హాయిగా." అని నచ్చజెప్పి పంపింది.నాకు ఎందుకో కళ్ళకు కట్టినట్లు గుర్తుంది.బడిలో చేరినపుడు ఇచ్చిన పుస్తకాలు అన్నీ బల్లపై పెట్టేశా ఎందుకో మరి.సంచిలో రెండు కథల పుస్తకాలు పెట్టుకుని వెళ్ళిపోయా.అలా ఎందుకు చేశానో మరి....
మధ్యాహ్నం మాష్టారు  అందరినీ లెక్కల పుస్తకాలు తీయమన్నారు.అంతా తీశారు.నేను,ఇంకో ఇద్దరు మిగిలాం.వాళ్ళూ నాలాగే తేలేదు.చెయ్యి చాపమని బెత్తం పట్టుకుని వచ్చారు ఆయన.ఒకరికి పడింది దెబ్బ.నా దగ్గరకు రాగానే ....హయ్యో రామా.. మాష్టారి చేతిలో బెత్తం లాక్కుని ముక్కలుగా విరిచేసి అక్కడే పడేసి ఏడుస్తూ ఇంటికి పరుగో పరుగు..అంతే..ఇంక నేను 1,2, తరగతులు చదవనేలేదు. సరాసరి 3వ తరగతిలో చేరా.1,2 తరగతుల వయస్సులో ఇంట్లో ఉండి నేను చదివినన్ని పుస్తకాలు ఎవరూ చదివి ఉండరు .. ఇంతకీ చెప్పొచ్చేదేమంటే బెత్తంతో భయపెడితే చదువంటేనే భయం పుడుతుంది..అవునా కాదా?

5, ఏప్రిల్ 2017, బుధవారం

awarded by DEO sir.

మిత్రులారా! శుభ సాయంత్రం. ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది. జిల్లా విద్యాశాఖాధికారి శ్రీ సుబ్బారెడ్డి గారు నా బాలసాహితీ కృషిని ప్రశంసిస్తూ నాకు ప్రత్యేక సన్మానం చేశారు.నా కథలలో 'అమ్ములూ-అయిదు రూపాయలూ" కథ బాగా నచ్చిందని పేర్కొంటూ నా సాహితీ ప్రక్రియలను ప్రోత్సహించే టానిక్ గా ఈ సత్కారాన్ని భావింపవలసిందిగా తెలిపారు.టెంత్ స్పాట్ వేల్యుయేషన్ మూడవ రోజు,శ్రీ రామనవమి ...మచిలీపట్నం సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్ ఆవరణలో జిల్లావ్యాప్తంగా వచ్చిన ఉపాధ్యాయుల మధ్య  లభించిన ఈ గౌరవం నాకు చాలా ప్రత్యేకమయినది.నా సాహితీ ప్రయాణాన్ని గురించి నాతో మాట్లాడించారు,వారూ మాట్లాడారు. నేను రాసిన గజల్ ఒకటి పాడించారు.గణిత ఉపాధ్యాయిని అయినా చక్కని శైలితో మంచి కథలు రాస్తున్నానని కొనసాగించమని దీవించారు.వృత్తి ప్రవృత్తులలో రాణిస్తున్న మరి కొందరికి కూడా సన్మానాలు జరిగాయి.