ఒక పొలం గట్టునున్న నూతిలో చాలా కప్పలుండేవి. ఒక రోజెవరో నూతిలో చేదవేసినపుడు అనుకోకుండా ఒక కప్ప నీళ్లతో పాటు బొక్కెనలో చేరింది. బావి నుంచి బయటపడుతూనే బొక్కెనలోంచి ఒక్కదూకు దూకింది. వెంటనే దాని ఒంటికి చల్లని గాలి హాయిగా సోకింది.
చుట్టూ చూసిన కప్పకి ఆశ్చర్యంతో మతిపోయింది. పచ్చని చెట్లు, నీలాకాశం, ఏపుగా ఎదిగిన పంట పొలాలు, కిలకిలారావాలతో సందడి చేస్తూ పక్షుల బారులు.
‘ఆహా! ప్రపంచం ఇంత బాగుంటుందా?’ అని అచ్చెరువొందింది. సంబరంతో ఉబ్బితబ్బిబ్బయ్యింది. ఇన్నాళ్లూ నూతిలో కప్పగా బతికిన తన బతుకు తల్చుకుంటే దానికి రోత కలిగింది.
ఇప్పటికైనా బయటపడినందుకు ఆనందించింది. నూతి గట్టు దాటి గంతులు వేస్తూ పొలాల్లో ఉన్న క్రిమికీటకాదులు కడుపారా తింటూ స్వేచ్ఛను ఆస్వాదించసాగింది. ఇంతలో బెకబెకధ్వనులు దాని చెవిని సోకాయి. ఆశ్చర్యంతో ఆగిందా కప్ప. గంతులు వేస్తూ అటుగా సాగింది. దానికో అందమైన పేద్ద చెరువు కనిపించింది.
ఆ చెరువు గట్టున బోలెడు కప్పలున్నాయి. చెరువులోకి దూకేవి కొన్ని. ఒడ్డుకు చేరేవి కొన్ని. ఇష్టారాజ్యంగా ఆటలాడుతూ సందడి చేస్తున్నాయి. నూతిలో కప్ప వాటిని నోరు తెరుచుకుని చూడసాగింది.
చెరువంతా తామరాకులు, పూలతో ఎంతందంగా ఉందో!. మరెంత విశాలమైనదో! అందులో వందల కప్పలు ఉండి ఉంటాయి.
‘నేను ఈ రోజు పొందుతున్న హాయిని అవి పుట్టినప్పటి నుంచి అనుభవిస్తున్నాయి. నేను ఇందాకటి వరకు బతికిన ఇరుకు, చీకటి, గాలిలేని ఆ నూతిని అవి ఎరగనే ఎరగవు.’ ఇలా ఆలోచిస్తున్న కప్ప మనసులో అసూయ ప్రారంభమైంది. అసూయ పెరుగుతున్న కొద్దీ దాని ఆనందం, ప్రశాంతత పోయాయి.
చెరువులో కప్పల్ని నూతి గతి పట్టిద్దామనే చెడు కోరిక దానిలో ప్రవేశించింది. ఇక ఆగలేకపోయింది. ఒక పన్నాగం పన్నింది. వెక్కివెక్కి ఏడవసాగింది. కాసేపటికి చెరువులో కప్పలన్నీ చుట్టూ చేరాయి. కారణం అడిగాయి.
అది బాధ నటిస్తూ ‘నూతిలో స్వర్గంలా ఉంటుంది. వెచ్చగా, సుఖంగా బతుకుతున్నాను. ఎవరో నీళ్లు తోడుకుంటుంటే పొరపాటున బొక్కెనలోకొచ్చి ఈ నరకంలో పడ్డాను’ అని నిట్టూర్చింది.
‘నూతిలో అంత బాగుంటుందా?’ అమాయకంగా అడిగిందో కప్ప.
‘అద్భుతంగా ఉంటుంది. మీరిన్నాళ్లూ ఎలా బతుకుతున్నారో నాకు అర్థం కావట్లేదు. వచ్చి గంటైనా కాలేదు. నరకంలా ఉంది నాకు’ అంది బడాయిగా.
ఇక చెరువులో కప్పలు నూతిలో చేరాలని ఉబలాటపడ్డాయి. నూతిలో కప్ప దారి చూపించగా నూతి చుట్టూ చేరాయి. బొక్కెన తాడు నూతి మీదుగా వేసి ఉంది. ‘అది ఎక్కి నూతిలో చేరండి. వెనక నేనూ వస్తాను’ ప్రోత్సహించింది నూతిలో కప్ప. ఇదంతా గమనిస్తున్న ఒక ముసలి కప్ప మిగతా కప్పల్ని ఆపింది. నూతిలో కప్పతో ఇలా అంది. ‘ఇతరులకు చెప్పే ముందు ఆచరించి చూపాలి. ముందు నువ్వు వెళ్లు. నీ వెనకే మేము వస్తాం. అంతే’ అని ఖరాఖండిగా తేల్చి చెప్పింది.
నూతిలో కప్ప తెల్లమొహమేసింది. గజగజలాడింది. దాని వాలకం చూసిన కప్పలన్నీ విషయం గ్రహించాయి. ఎంత ప్రమాదం తప్పిందో అని గుండెలు బాదుకున్నాయి. బండారం బయటపడిన కప్ప అవమానంతో దూరంగా వెళ్లిపోయింది. అందుకే పెద్దలు అనుభవంతో చెప్పిన మాట వినాలి. అనుకుంటూ కపటపు కప్ప నుంచి కాపాడిన ముసలికప్పను అభినందించాయి కప్పలన్నీ.
- గుడిపూడి రాధికారాణి
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి