11, ఫిబ్రవరి 2017, శనివారం

review on gamanam.

ఈ నెల(ఫిబ్రవరి,2017)భావ తరంగిణి మాసపత్రికలో నా సమీక్ష.."గమనం-గుత్తికొండ సుబ్బా రావు సాహితీ జీవనం".
డా.జి.వి.పూర్ణ చంద్ తన హృదయ తంత్రులను తీసి ఆత్మీయ వస్త్రంగా నేసి చైతన్యపు రంగులు అద్ది తన నేస్తం గుత్తికొండ సుబ్బా రావుకు సత్కారంగా సమర్పించిన అనురా'గమనం' ఈ గమనం.ఇది గుత్తికొండ సప్తతి సందర్భంగా గుత్తికొండ రామరత్నం చారిటబుల్ ట్రుస్ట్ ప్రచురణ.
   జీవితమంతా చీకటి...ప్రేరణ లేకున్న;ప్రేరణ సైతం గుడ్డిది..జ్ఞానం లేకున్న;జ్ఞానమంతా మిధ్య...ఆచరణ లేకున్న;ఆచరణం వృధా కదా ప్రేమమయం కాకున్న....వీరిరువురి మైత్రి ప్రేమమయమైంది కనుకే వీరి జీవితాలు శొభాయమానమై ఆ వెలుగులు ఎందరో వర్ధమాన రచయితలకు తోవ చూపాయి.
   కుమార్తెలు స్పందన,భారతి,కవితలు;డా.జి.వి.పి.;విహారి,డా.మాదిరాజు రామలింగేశ్వర రావు,డా.ఎన్.గోపి,సి.వేదవతి,డా.ధన్వంతరి,పెనుగొండ లక్ష్మీ నారాయణ,కొట్టి రామా రావు,పువ్వాడ తిక్కన సోమయాజి,పెళ్ళకూరు జయప్రద,డా.కె.బి.లక్ష్మి మొదలగు వారి అంతరంగాన దాగిన ఆదరపు ఊటలన్నీ ఈ గమనంలో వ్యాసాలుగా విరజిమ్మబడినాయి.లెక్కలేనన్ని రేకులు గల పుష్పం వికసించినట్లుగా ఉంటుందీ పుస్తక పఠనం.
  పుస్తకం ఆసాంతం చదివించబడేలా ఉండాలంటే చక్కని నాణ్యత గల కాగితం వాడితే సరిపోదు.ప్రతి వాక్యం స్పూర్తిదాయకంగా ఉండాలి.గమనం లో 'మా నాన్న ' అంటూ గుత్తికొండ కుమార్తెలు మొదలుకొని డా.కె.బి.లక్ష్మి "ఒక పరిచయంలోంచి అనేక జ్ఞాపకాల్లోకి" వరకు ప్రతి వాక్యం ప్రేరణనిస్తుంది.
   కేవలం గుత్తికొండ సాహితీ జీవన పరిచయంగా కాక పాఠకులు ప్రేరణ పొందేలా,తమ జీవన శైలిని మరింతగా మెరుగుపరుచుకోవాలని ఉవ్విళ్ళూరేలా ఉందీ గమనం.ఇది డా.జి.వి.పూర్ణ చంద్ కూర్పులోని గొప్పదనం,గుత్తికొండ కుమార్తెల సంకల్పబలం,గుత్తికొండ జీవన విధానం లోని విశిష్టత,ఆ మాధుర్యాన్ని అత్యద్భుతంగా ఆవిష్కరించిన వ్యాసకర్తల గొప్పదనం,అన్నీ సమపాళ్ళలో కలిసిన జీవన గానం ఈ 'గమనం'.
      ఒకే సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ఉగాది సాహితీ ప్రతిభా పురస్కారం,భాషా సేవా పురస్కారం అందుకోవడానికి కారణమైన జి.ఎస్.వ్యక్తిత్వం,కృషి,చేసేపనిలో నిజాయితీలు ఆదర్శప్రాయంగా నిలుస్తాయి.అందుకే గమనం వారిని తెలుసుకోవడానికి కాదు చదవవలసినది.మనను మలుచుకోవడానికి.
   వీరిని అనంతస్వప్నాల క్రాంతిదర్శిగా అభివర్ణించారు డా.కె.బి.లక్ష్మి.ఇది సప్తతి సందర్భంగా వెలువడినా 'నిత్య చైతన్యానికి వయసెంత?' అంటారు సి.వేదవతి.'సుబ్బా రావుకి ఆవేశం ఎక్కువ..అంటారంతా.కానీ అతను లాజికల్ రేషనలిస్ట్ అంటారు విహారి.వారిద్దరి మధ్య దోసిట్లో నీళ్ళలా జారిపోయిన 45 ఏళ్ళ జ్ఞాపకాల్నీ, అనుభవాల్నీ మనకో పాఠంలా పంచారాయన.'ఆయనది సజ్జన క్రోధం.అది క్షణికమే కానీ రాగద్వేషాలకు తావీయదు.'అంటారు డా.మాదిరాజు రామలింగేశ్వర రావు.
  'నాయకుడు అహంకారం, నోటి దురుసుతనం వదులుకోవాలి..కార్యకర్త కలలు కనాలి కానీ నిద్రపోకూడదు...'సుబ్బారావులోని అణకువతో కూడిన కాఠిన్యం మనకు నేర్పుతున్న పాఠం ఇదే.'అంటూ గుత్తికొండ జీవన గమనాన్ని హృద్యంగా ఆవిష్కరించారు డా.జి.వి.పూర్ణచంద్.
    గుత్తికొండ జీవన పరిచయం,తాత్విక చింతన-తార్కిక పోకడ,కార్యకర్తగా(మితిమీరిన కార్యకర్తృత్వం  ఆయనలోని రచయితను త్యాగం చేయాల్సిన పరిస్థితిని కుందుర్తి గమనించి హెచ్చరించినా ఆయన లెక్కచేయలేదు.),నాయకుడిగా,భాషోద్యమ సూత్రధారిగా,కృ.ర.సం.అధ్యక్షుడిగా ఇంకా ఎన్నో...సహస్ర ముఖాల,సహస్ర కోణాలను ఆవిష్కరించిన ఈ గమనం అందరికీ ఒక అమృత కలశం.
   దీనిలోని అరుదైన చిత్రాలు మొదలుకొని చివరి అమృత బిందువు పూర్ణచంద్ కవిత 'అనురాగమనం' వరకు ఆద్యంతం అద్భుతం.
                                                                                             గుడిపూడి రాధికా రాణి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి