27, అక్టోబర్ 2015, మంగళవారం

పజిల్ నెం.1.. వాక్యాల్లొ 3 జీవులు

ఒక్కో వాక్యం లో మూడేసి జీవులు దాక్కున్నాయి..కనిపెట్టగలరా??
1. మా మేనత్త ఈ గది లో వాచీ మర్చిపోయింది.
2. మేకప్ తీసేసి కుక్కర్ పెట్టేస్తే ఈ రోజింక పని లేనట్లే.
3. నీతూ! నీ గదిలోనే ఏదో మందమతిలా ఏకాకిగా కూర్చోకు.
4. కిషోర్ గాడి దర్పం, కోపం దినందినం పెరుగుతున్నాయి.
5. ఏది ఏమైనా ఈ ఉల్లిపకోడి వాసనకు ఆవులింతలాగిపోతాయి.
6. తుపాకి పేలుస్తానని ఖాసిం హంగామా చేసింది ఇప్పుడే గదా.
మరికొన్ని వాక్యాలు,జవాబులు రేపు..మీ ఆసక్తిని బట్టి.
నేను రాసిన ఈ పజిల్ ఈనాడు హాయ్ బుజ్జీ లో 28/01/2007 న ప్రచురితం.
ధన్యవాదాలు.

26, అక్టోబర్ 2015, సోమవారం

ఒక మాట

రేపటి నుండి రోజుకో పజిల్..మీ పిల్లల కోసం..శీర్షిక: "వాక్యాల్లో ఏం దాక్కున్నాయ్??" మరి మీరు సిద్దమేనా?
ఉదా: "జింకపిల్ల గంతులు వేస్తోంది."
పై వాక్యం లో జింక కనబడుతూనే ఉంది..దాక్కున్న రెండో జంతువును పట్టుకోండి చూద్దాం.

20, అక్టోబర్ 2015, మంగళవారం

ఒక ఖైదీ రాసిన ఆఖరి లేఖ..ఈనాడు హాయ్ బుజ్జీ లో నా 11వ పజిల్..@03/04/2005.

ఒక ఖైదీ రాసిన ఆఖరి లేఖ..ఈనాడు హాయ్ బుజ్జీ లో నా 11వ పజిల్..@03/04/2005.ఈ లేఖలో 11 వాహనాలు దాక్కున్నాయి.వాటిని పట్టుకోవాలి.అదీ సంగతి.మరి ప్రయత్నించండి.అన్నట్లు తెలుగు సదస్సు లో డిగ్రీ స్థాయి లో పజిల్స్ పోటీ నిర్వహించారు 2012 లో.(ఈనాడు వారు) అందులో ఈ పజిల్ ఒకటి.ఆ పజిల్స్ పోటీ రూపకల్పన , నిర్వహణ నాకు అప్పగించారు.

11, అక్టోబర్ 2015, ఆదివారం

ఒక మాట..మంచి సందేశాలు విన్నానీ రోజు.

 కొన్ని గంటల క్రితం(10/10/15) కృష్ణాజిల్లా రచయితల సంఘం 2014,2015సంవత్సరాల సాహితీ పురస్కారాల ప్రదానసభ విజయవాడ,హోటల్ ఐలాపురం ఎ.సి.సెమినార్ హాల్ లో కన్నుల పండువగా జరిగింది.
వేదిక పై ఉన్న మహామహులను చూడటానికి ఒళ్ళంతా కళ్ళై,వారు మాట్లాడుతుంటే ఒళ్ళంతా చెవులై..ఆ మాటల్లో కొన్ని ఆణిముత్యాలు మీతో పంచుకొన మనసై..
"వ్యక్తి కి బహువచనం శక్తి"అంటూ నవ్వుల పువ్వులు పూయిస్తూనే ఆలోచనలు రేకెత్తించిన శ్రీ గొల్లపూడి మారుతీ రావు,
దేశానికి ఇండిపెండెన్స్ వచ్చింది అంటాం గానీ ఇండిపెండెంట్ వచ్చింది అనం కదా..అలా..దేశానికి స్వతంత్రం వచ్చింది అనరాదు ..స్వర్ణకారులు,చిత్రకారులు లాగా మత్స్యకారులు అనరాదు.అంటూ శ్రీ రవ్వా శ్రీహరి..సూర్యరాయాంధ్ర నిఘంటువు లో లేని పదాలు కూర్చి 1000 పేజీల నిఘంటువు వేశారీయన.వీరు గ్రామర్ కే గ్లామర్ అద్దారు వంటి అద్భుతమైన అనుసంధానాలతో సభాధ్యక్షత వహించారు శ్రీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్.
 కవిత రాయడమంటే ఇంతకాలం బతికిన బతుకంతా మళ్ళీ ఒకసారి బతకాలనిపించడమంటూ శ్రీ వాడ్రేవు చిన వీరభద్రుడు ..కవిత్వం నా కనురెప్పలపై వాలిన కమ్మని కల..నేలని చీల్చుకుని అంకురం వచ్చినపుడు..తప్పిపోయిన బిడ్డ తిరిగి వచ్చినంత సంబరం.అంటూ శ్రీ రాధేయ ఒళ్ళు పులకరింపజేశారు.
"విజయవాడ కో సాహిత్యకిరీటం కృష్ణాజిల్లా రచయితల సంఘం" అంటూ శ్రీ అప్పలనాయుడు అలరిస్తే డి.కామేశ్వరి గారు రచయితల సమస్యలను సున్నితంగా ప్రస్తావించారు.
జ్ఞానం పెట్టుబడి తక్కువ..లోకజ్ఞానం పెట్టుబడి ఎక్కువ ప్రస్తుత కాలంలో అంటూ శ్రీ సి.రాఘవాచారి ఆలోచింపజేస్తే చివరగా శ్రీ వీరాజీ గారు "చివరకు మిగిలేది..నేనే" అని నవ్విస్తూ ఆరంభించి.."ఆంధ్రపత్రిక సంపాదకునిగా నా సంపాదన ఇప్పుడు కనబడింది..మీ అభిమానం రూపంలో ..అల ఒడ్డు కు వస్తే కేరింతలతో ఆనందిస్తాం..కనీ అది పడే సంఘర్షణ,సంక్షోభం మనకి తెలీవు."అంటూ హృద్యమైన ప్రసంగంతో మనసు కు తడి చేశారు.
ఆంధ్రపత్రిక శతజయంత్యుత్సవాలను ఈ సంవత్సరం జరుపుకుందాం అని మండలి బుద్దప్రసాద్ గారు ప్రకటించారు.
ఈ అద్భుతమైన సభలో పాల్గొనడమే కాక డా.తుర్లపాటి రాజేస్వరి గారి సన్మానపత్రం చదివే అవకాశం కల్పించిన కృష్ణాజిల్లా రచయితల సంఘం అధ్యక్షులు శ్రీ గుత్తికొండ సుబ్బారావు,ప్రధాన కార్యదర్శి డా.జి.వి.పూర్ణచంద్ గార్లకు నా ధన్యవాదాలు.
                                 

7, అక్టోబర్ 2015, బుధవారం

ఒక మాట..మీకో సరదా సినిమా పరీక్ష పెట్టనా??

మీకో సరదా సినిమా పరీక్ష..ఇది నా 24వ పజిల్..ఈనాడు హాయ్ బుజ్జీ లో..27/11/2005న ప్రచురితం..జవాబులు కావాలంటే ఆది వారం వరకు ఆగండి.
సినిమా టైటిల్స్ లో చాలా విషయం ఉందండోయ్.
క్రింది ప్రతి ప్రశ్న కి సరిపోయేలా మీరు రెండేసి సినిమా పేర్లు చెప్పాలి..ఆధారనికి సరిపోయే పదం సినిమా పేరులో ఉంటే చాలు.(2 కంటే ఎక్కువ జవాబులు కూడా వస్తాయి)
ఉదా: రుతువులు=వసంతం,వర్షం.

1.దిక్కులు     2.రుతువులు   3.వారాలు     4.నెలలు    5.వాహనాలు
6.సంఖ్యలు    7.సంగీతరాగాలు   8.లోహాలు    9.పక్షులు  10.కీటకాలు
11.జంతువులు  12.వృత్తులు  13.ఆయుధాలు  14.సంగీతవాయిద్యాలు  15.క్రీడలు
16.పువ్వులు  17.రంగులు  18.పండుగలు   19.ముద్దుపేర్లు  20.తిట్లు
21.బంధుత్వాలు  22.నగరాలు  23.దేశాలు  24.మహాభారతం పాత్రలు  25.స్వాతంత్ర్య సమరయోధులు.