21, జూన్ 2016, మంగళవారం

నా సాహితీ పురోగతి.,

చరిత్రపరిశోధకులు,సాహితీమిత్రులు(మచిలీపట్నం శాఖ) అధ్యక్షులు మహమ్మద్ సిలార్ గారు రాసి ఇటీవల ఆవిష్కరించిన "మచిలీపట్నం సర్వస్వం"(ENCYCLOPEDIA OF MACHILIPATNAM) గ్రంధంలో బందరు సంస్కృతి-సాహిత్య రంగం విభాగం లో నా వివరాలకు చోటు లభించింది.
ఉన్న ఊరు కన్నతల్లి వంటిది అంటారు.అలాంటి ఊరి చరిత్రపుటల్లో నా వివరాలు పదిలపరచబడి శాశ్వతం అయ్యాయి అంటే..ఎంత ఆనందంగా ఉందోనండి.అందునా ఆ ఊరు "బందరు." నా ఆనందాన్ని మీతో పంచుకుంటూ సిలార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
నా చిటికెడు సాహితీ కృషికి కొండంత ప్రోత్సాహం అందిస్తున్న మీ అందరికీ కూడా నా నమస్సుమాంజలి.
అన్నట్లు ఆ సుదీర్ఘ పుస్తక ప్రూఫ్ దిద్దిన వ్యక్తిగా మీఅందరికంటే ముందు చదివిన భాగ్యం కూడా నాదే సుమా..20, జూన్ 2016, సోమవారం

విశ్వనాధ సత్యనారాయణ జాతీయ సదస్సులో నా వ్యాసం ...

విశ్వనాధ సత్యనారాయణ జాతీయ సదస్సు(2015)లో పరిశోధనాత్మక పత్ర సమర్పణ చేసే ఒక గొప్ప అవకాశాన్ని నేను పొందాను.కృష్ణాజిల్లా రచయితల సంఘం వారి ఆశీస్సులకి,వారు నా పై ఉంచిన నమ్మకానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.ఎందరో హేమాహేమీల,సాహితీ స్రష్టల ఔదార్యమే నన్ను  ఈ సాహసానికి పూనుకునేలా చేసింది.అప్పటి నా వ్యాసం ఇప్పుడు ఇదిగో..ఈ  గ్రంధం లో ఒదిగిపోయి నన్ను  ధన్యురాలిని చేసింది.చాలా చాలా సంతోషంగా ఉంది.ఎలా వ్యక్తపరచాలో తెలీనంత.
ధన్యవాదాలు..శ్రీ గుత్తికొండ సుబ్బారావు గారికి, డా.జి.వి.పూర్ణచంద్ గారికి.
19, జూన్ 2016, ఆదివారం

**ఈ రోజు "ఫాదర్స్ డే"సందర్భంగా "బాల్యం లో నా జ్ఞాపకం-4".**

   **ఈ రోజు "ఫాదర్స్ డే"సందర్భంగా "బాల్యం లో నా జ్ఞాపకం-4".**

నాన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో ఉద్యోగి.అప్పుడు మేం ముదినేపల్లి లో ఉన్నాం.నేను 3వ తరగతి లేదా 4వ తరగతి అనేది సరిగ్గా గుర్తులేదు. నా 5వ ఏట నుండే చందమామలు చదవడం అలవాటు చేశారు నాన్న.ఒక రోజు జ్వరంగా ఉందని నేను బడి మానేశా.నాన్న బ్యాంక్ కి వెళ్ళారు.11 గంటల ప్రాంతంలో వచ్చి(అప్పట్లో సైకిలు) నాకో పుస్తకం ఇచ్చారు.ప్రమోద బాలల మాసపత్రిక.కొత్త పత్రిక ఆ రోజు మొదటి సంచిక వచ్చింది.అని చెప్పి మంచినీళ్ళు కూడా వద్దని మళ్ళీ వెళ్ళిపోతుంటే అమ్మ అడిగింది.ఎందుకు అంత పనిలో ఎండలో  మీరు రావడం? అటెండర్ కిచ్చి పంపొచ్చుగా.లేదా సాయంత్రం తెస్తే సరిపోయేదిగా. అని.
దానికి నాన్న జవాబు.."దాని మొహం మతాబులా వెలిగిపోతుంది కొత్త పుస్తకం చూస్తే.కళ్ళారా చూద్దాం అని నేనే వచ్చాను.సాయంత్రం వరకు ఎందుకు ఆగడం?ఆపడం?".
అలా సైకిల్ పై తిరిగి బాణం లా వెళ్ళిపోయిన నాన్న ని చూసిన కన్నులతోనే  ఆయాసంతో బాధ పడుతూ..2012 లో ఎండదెబ్బకు నా కన్నుల ముందే నన్ను వదిలి వెళ్ళిపోయిన నాన్న ను చూశాను.
  "నాన్నా! నేను చేసే ప్రతి రచన లోనూ,నా ప్రతి సాహితీ గెలుపు నాకు అందించిన స్పూర్తి లోనూ నువ్వు నాతో ఉంటావు.ఉన్నావు."
 


11, జూన్ 2016, శనివారం

ఈనాటి(11.6.16) ఈనాడు హాయ్ బుజ్జీ లో నా పజిల్..


****నా బాల్యం నుండి ఒక జ్ఞాపకం--2****

****నా బాల్యం నుండి ఒక జ్ఞాపకం--2****


1,2 తరగతులు చదవకుండానే తిన్నగా 3వ తరగతిలో చేరా. (అలా ఎందుకో ఇంకోసారి చెప్పుకుందాం.) అన్ని సబ్జక్టుల్లో నేను గాని,అనగాని మాధవి అనే ఒకమ్మాయి గాని ఫస్టు వస్తూ ఉండేవాళ్ళం. ఫస్టు రావడమంటే మనతో ఆటల్లో పచ్చి కోట్టేసిన పిల్లలతో కూడా చప్పట్లు కొట్టించుకోవడం అన్నమాట. అదీ టీచర్ గారే కొట్టమంటారు భలేగా.
కొన్ని నెలలకి ఇంగ్లీష్ అక్షరాలు నేర్పించారు. అమ్మ అప్పటికే నేర్పిందిగా మరి.నాకు హాయిగా అనిపించింది.అక్షరానికో పదం చొప్పున 26 మాటలు కూడా బాగా చదివించారు టీచర్ గారు(ఆవిడ పేరు గుర్తులేదు.కానీ నేను మురళీమోహన్ కి అక్క అవుతాను తెలుసా అంటూ ఉండేవారు) ఆదివారం చదవండి.సోమవారం వీటిలో 10 మాటలు చూడకుండా రాయిస్తాను.ఆ పరీక్ష లో 10 కి 10 ఎవరికొస్తాయో చూద్దాం అన్నారు.
ఇంటికెళ్ళా.వచ్చినవే కదా అని చందమామ చదివా.ఆడుకున్నా.సోమవారం పొద్దున్న అన్నయ్య ని అప్పచెప్పుకోమన్నా.అంబ్రెల్లా తో సహా అన్నీ వస్తున్నాయి.ఎందుకో ఎలిఫెంట్ లో అక్షరాలు రావట్లా.టైం అయిపోతోంది.మాధవి ఫస్టు వచ్చేస్తుందేమోనని ఏడుపుమొహం పెట్టేశా.
అన్నయ్య నా అరచేతిలో ఆ మాట రాసేసి పొమ్మన్నాడు.
ఇంతలో అమ్మ కేక.ప్రసాదం తీసుకుని వెళ్ళమని.చక్రాలుగా తరిగిన అరటిపండుముక్కలు,కొబ్బరిముక్కలు.తినేసి వెళ్ళిపోయా.
రమణ అనే వాడు అల్లరి చేస్తే కొట్టడానికి చెయ్యి చాపమన్నారు టీచర్.తీరా వాడి చేతిలో 3 మాటలు.ఇంక చూస్కోండి.అందరినీ చేతులు చాపమని పరిశీలన మొదలెట్టారావిడ.నా గుండెల్లో రాయి పడింది.భయపడుతూ చేతులు చాపా.తీరా నా చేతుల్లో...ఎలిఫంట్ లేదు.హమ్మయ్య.
అమ్మ చేతులు కడుక్కుని తినే అలవాటు చెయ్యడం వల్ల నేను ప్రసాదం తినేటప్పుడు చేతులు కడిగా.అప్పట్లో ఇంక్ పెన్నులు కదా.సిరా పోయింది.
కాపీ కొట్టడం అంటే అదేనని అప్పట్లో నాకు తెలీదు.కానీ అది కలిగించే గుండె దడ ఎలా ఉంటుందో తెలిశాక జన్మలో అడ్డదారులు తొక్కలేదు.ఫస్టు మార్కు కోసం.
థేంక్యూ అమ్మా.