11, జూన్ 2016, శనివారం

****నా బాల్యం నుండి ఒక జ్ఞాపకం--2****

****నా బాల్యం నుండి ఒక జ్ఞాపకం--2****


1,2 తరగతులు చదవకుండానే తిన్నగా 3వ తరగతిలో చేరా. (అలా ఎందుకో ఇంకోసారి చెప్పుకుందాం.) అన్ని సబ్జక్టుల్లో నేను గాని,అనగాని మాధవి అనే ఒకమ్మాయి గాని ఫస్టు వస్తూ ఉండేవాళ్ళం. ఫస్టు రావడమంటే మనతో ఆటల్లో పచ్చి కోట్టేసిన పిల్లలతో కూడా చప్పట్లు కొట్టించుకోవడం అన్నమాట. అదీ టీచర్ గారే కొట్టమంటారు భలేగా.
కొన్ని నెలలకి ఇంగ్లీష్ అక్షరాలు నేర్పించారు. అమ్మ అప్పటికే నేర్పిందిగా మరి.నాకు హాయిగా అనిపించింది.అక్షరానికో పదం చొప్పున 26 మాటలు కూడా బాగా చదివించారు టీచర్ గారు(ఆవిడ పేరు గుర్తులేదు.కానీ నేను మురళీమోహన్ కి అక్క అవుతాను తెలుసా అంటూ ఉండేవారు) ఆదివారం చదవండి.సోమవారం వీటిలో 10 మాటలు చూడకుండా రాయిస్తాను.ఆ పరీక్ష లో 10 కి 10 ఎవరికొస్తాయో చూద్దాం అన్నారు.
ఇంటికెళ్ళా.వచ్చినవే కదా అని చందమామ చదివా.ఆడుకున్నా.సోమవారం పొద్దున్న అన్నయ్య ని అప్పచెప్పుకోమన్నా.అంబ్రెల్లా తో సహా అన్నీ వస్తున్నాయి.ఎందుకో ఎలిఫెంట్ లో అక్షరాలు రావట్లా.టైం అయిపోతోంది.మాధవి ఫస్టు వచ్చేస్తుందేమోనని ఏడుపుమొహం పెట్టేశా.
అన్నయ్య నా అరచేతిలో ఆ మాట రాసేసి పొమ్మన్నాడు.
ఇంతలో అమ్మ కేక.ప్రసాదం తీసుకుని వెళ్ళమని.చక్రాలుగా తరిగిన అరటిపండుముక్కలు,కొబ్బరిముక్కలు.తినేసి వెళ్ళిపోయా.
రమణ అనే వాడు అల్లరి చేస్తే కొట్టడానికి చెయ్యి చాపమన్నారు టీచర్.తీరా వాడి చేతిలో 3 మాటలు.ఇంక చూస్కోండి.అందరినీ చేతులు చాపమని పరిశీలన మొదలెట్టారావిడ.నా గుండెల్లో రాయి పడింది.భయపడుతూ చేతులు చాపా.తీరా నా చేతుల్లో...ఎలిఫంట్ లేదు.హమ్మయ్య.
అమ్మ చేతులు కడుక్కుని తినే అలవాటు చెయ్యడం వల్ల నేను ప్రసాదం తినేటప్పుడు చేతులు కడిగా.అప్పట్లో ఇంక్ పెన్నులు కదా.సిరా పోయింది.
కాపీ కొట్టడం అంటే అదేనని అప్పట్లో నాకు తెలీదు.కానీ అది కలిగించే గుండె దడ ఎలా ఉంటుందో తెలిశాక జన్మలో అడ్డదారులు తొక్కలేదు.ఫస్టు మార్కు కోసం.
థేంక్యూ అమ్మా.

1 కామెంట్‌:

  1. రాధిక అక్కగారు మీ చిన్ననాటి జ్ఞాపకం చాల బాగుంది , ఓకే విదంగా ఆ దేవుడే అమ్మ రూపంలో మిమ్మల్ని రక్ష్నిచాడు కదూ .......ఫోటో కూడా బాగుంది

    రిప్లయితొలగించండి