24, మార్చి 2016, గురువారం

స్మృతి హారతి (ఎలిజీ)

స్మృతి హారతి (ఎలిజీ)
రాళ్ళబండి కవితాప్రసాద్ కు కవితాంజలి.
కంప్యూటర్ యుగం కాదిది రాతి యుగమే.."రాళ్ళ"బండి యుగమే.
మీ పేరు లోనే కవి ని,తావి ని ఇముడ్చుకున్నారు
దోసిట్లో భూమండలం మీ "కవితా ప్రసాదం"
సాహిత్యం తోనే మీ సాన్నిహిత్యం
అక్షరాలతో అవలీలగా అవధానాటలాడుతుంటే
60 నిమిషాల్లో 360 పద్యాలు,
25 నిమిషాల్లో అవధానం పూర్తి
లాంటి వింతలతో కొత్త పుంతలతో
కొంగ్రొత్త ప్రక్రియలు స్రుష్టిస్తుంటే
ఒప్పుకోవాలి..తప్పు మాదేలే.
మా అబ్బురపు సెగ అంబరాన్నంటి
మా చప్పట్ల తప్పెట్ల మోతకి
దేవతలు అదిరి చెదిరి
శచీపతి నిద్దుర వదిలి కదిలి
ఏమా అవధాన ప్రక్రియా వైవిధ్యం!
చూడాల్సిందేనని కుతూహలపడి
అర్ధంతరంగా మిము ఆహ్వానిస్తే.. కాదనలేక
కలగంటున్న లక్ష పద్యార్చన పక్కకు పెట్టి
రాళ్ళ బాట లోని తెలుగు బండి ని నల్లేరు పై నడపాలనే
మీ ఆశయాన్ని ఆశగా మా శ్వాస లో నింపి
ఒంటరి పూలబుట్ట లా మమ్మిలనొదిలి
కోటికొమ్మల చెట్టు లా మీరిలనొదిలి...
మౌనంగా నిష్క్రమించారు.
మూగబోయింది నూరు తీగల వీణయే కాదు....మెం కూడా.
అయితేనేం..
ప్రతి సాహితీ సభ దీపశిఖ రెపరెప లోనూ
మీ ఊపిరి మాకు కనబడుతుంది.
మా రచనలతో తెలుగుని వెలిగిస్తున్నపుడు
చప్పట్ల ధ్వని లో మీ గుండె చప్పుడు మాకు వినబడుతుంది..
@గుడిపూడి రాధికా రాణి.
(బందరులో సంస్మరణ సభలో చదివిన కవిత)

20, మార్చి 2016, ఆదివారం

కథ కంచికి....కథ ఏమిటో తెలుసా??

కథ కంచికి....కథ ఏమిటో తెలుసా??
మనం (ఆంధ్రప్రదేశ్,తెలంగాణా) తమిళనాడు తో కలిసి ఉన్నప్పుడు తెలుగు ఎక్కువ  మాట్లాడే వారి సరిహద్దులు కంచివరకు వ్యాపించి ఉండేవట.అక్కడనుండి తమిళం ఎక్కువ  మాట్లాడేవారి ఎల్లలు ప్రారంభమయ్యేవన్నమాట.
 ఎవరైనా కథ చెపితే కథ కంచికి..మనం ఇంటికి అంటారు. అంటే ఈ కథ ఊరు ఊరు,వాడవాడ చెప్పుకోవాలని...అలా కంచివరకు ఈ కథ తెలుగువారందరూ చెప్పుకునేలా వ్యాపించాలని.. అంత మంచి కథ చెప్పుకున్నామని సంతోషిస్తూ ఇంటికి చేరతారన్నమాట.
 ఇప్పుడర్ధమైందా ??  "కథ కంచికి..మనం ఇంటికి"  అని ఎందుకు అంటారో..
  ఈ సందర్భంగా నేను రాసిన మొదటి పిల్లల కథని మీతో పంచుకోవాలనుకుంటున్నాను..రాసిన..ప్రచురింపబడిన కాదు సుమా!
ప్రచురింపబడిన మొదటి కథ నేను 6వ తరగతిలో ఉండగా "బాలజ్యోతి" మాసపత్రిక లోనిది.నాకు అది గుర్తు లేదు.పుస్తకం చెదలు చదివేశాయి.
కాబట్టి...ఇక ఈ కథ కంచికి..నేను పనిలోకి.
కథ పై మీ అభిప్రాయాలు చెప్పండేం..

19, మార్చి 2016, శనివారం

ఒక అందమైన జ్ఞాపకం..

హైస్కూలు నుండి యు.పి.కి బదిలీ అయినపుడు...పెడనలో 3వ తరగతి పిల్లలకు తెలుగు చెప్పా కొన్నాళ్ళు.ఒక పాప చాలా దిగులుగా కనబడేది..ఒక్క తెలుగు అక్షరం కూడా రాదు.అందరూ హుషారుగా రాసి,చదివేస్తుంటే అలా చూస్తూ కూర్చునేది.రావడమే వారానికి ఒకటో రెండో రోజులు..అప్పుడు నేర్పుదామన్నా ఉత్సాహం చూపేది కాదు.అసలు ఏమై ఉంటుంది..
ఒక బైక్ పాడయిందంటే లోపం ఎక్కడుందో కనుగొని సరిచేయాలి..కొడితే బాగుపడుతుందా..పాపం పిల్లలూ అంతే కదా..వారు ఏం అంశం లో వెనుకబడుతున్నారో గమనించి సరిచేయాలి.
ఇదే ఉద్దేశం తో..చేరదీసి వివరాలు కనుక్కున్నాను.తల్లి చనిపోయిందట.కొత్త అమ్మ కొడుతోందని ఏడుస్తూ చెప్పింది..
 ఆ పాప కి అక్షరాలు రావాలి..చదువంటే ఇష్టం పుట్టాలి. ఏం చేయాలి??  పరిస్థితిని బట్టి పాఠం చెప్పాలి. కలంకారీ కళ నిండిన పెడనలో పిల్లలకి గ వత్తు రావాలంటే "మగ్గం" అర్ధమైనంత సులువుగా పుస్తకం లోని "అగ్గి మీద గుగ్గిలం" తెలుస్తుందా..
 ఒక ఉపాయం తోచింది.కురవని మేఘం లా దిగులుగా ఉన్న ఆ పాపని దగ్గరకు రమ్మని పిలిచా. అమ్మ పేరు అడిగా."సీత"అని  చెప్తుండగానే పిల్ల కళ్ళలో నీళ్ళు.పలక మీద  సీత అని రాసి ఇచ్చా ఎలా రాయాలో గమనింపచేస్తూ.
ఇంక చూస్కోండి..నేల మీద,బోర్డ్ మీద, గాలిలో సీత అని రాస్తూ ఉండేది.తర్వాత అమ్మ కిష్టమైన కూర..వంకాయ..అలా మెల్లిమెల్లిగా ఆ పాప చదువులోకి వెళ్ళిపోయింది..తను 5లో ఉండగా నేను మేథ్స్ ప్రమోషన్ లో వెళ్ళిపోయాను..ఇప్పుడు తను ఎదురైనా నేను గుర్తుపట్టలేను. తనకి నేను గుర్తున్నానో లేదో కూడా తెలీదు.కానీ ఆ శ్రమని,అది మిగిల్చిన తృప్తిని మర్చిపోలేను.  

17, మార్చి 2016, గురువారం

నా బాల్యం నుండి ఒక జ్ఞాపకం..

ప్రభుత్వ పాఠశాల లో 3వ తరగతి నుండి ఇంగ్లీష్ అక్షరాలు నేర్పేవారు అప్పట్లో. 1,2 తరగతులలో తెలుగు,గణితం,పరిసరాల విజ్ఞానం..అంతే.కానీ అప్పటివరకు ఆగకుండా మా అమ్మ నా 5వ ఏటనే ఎ,బి,సి,డి  లు నేర్పింది.ఏం నేర్చుకుంటున్నానో, ఎందుకు నేర్చుకుంటున్నానొ మాత్రం తెలీదు.
  మొత్తానికి 3/4 రోజులకి అన్ని అక్షరాలూ వచ్చేశాయి.వరుసగా రాయడమే కాక అడిగిన అక్షరం రాసి చూపడం తో సహా. ఆ ఆదివారం నాన్న ముందు ప్రతిభా ప్రదర్శన కు రంగం సిద్దం చేసింది.నాన్న పెన్ను,ఒక పేపర్ ఇచ్చింది.ఎప్పుడూ పలక పైన బలపంతో రాసే నాకు ఇక ఒకటే సంబరం.
    టకటకా కోరుకున్న అక్షరం రాసి చూపిస్తున్నా.అన్నయ్య,అక్క,నాన్న పక్కింటి కుసుమక్క ...ఇలా.
 లాభం ఏమిటొ ఈ అక్షరాలు ఎందుకు రావాలో మాత్రం తెలీట్లేదు.
  అప్పుడు అమ్మ అంది...పి రాయి అని..రాశా.పక్కనే యి ఆ పక్కనే ఎన్ కూడా రాయమంటే రాశా." ఇలా అక్షరాలు కలిపితే తెలుగు లో లాగే ఇంగ్లీష్ లో కూడా మాటలు అవుతాయి..ఇప్పుడు నువ్ రాసిందేమిటో తెలుసా? "పెన్". నీ చేతిలో ఉన్నది.ఆ పేరు నువ్వు ఇంగ్లీష్ లో రాశావు.అంది నవ్వుతూ.
  ఎంతో ఆనందం...మాటల్లో చెప్పలేను.నాకు తెలిసిన వస్తువు ను నేను ఒక కొత్తభాష లో రాశా.
  గంతులేస్తూ అందరికీ ఏం చెప్పానో తల్చుకుంటే ఇప్పుడు నాకు నవ్వొస్తుంది...అప్పుడు వాళ్ళు నవ్వారనుకోండి.
 ఇంతకీ అమాయకంగా ఏం చెప్పానో చెప్పలేదు కదూ..      "నాకు ఇంగ్లీష్ వచ్చేసిందోచ్..."  అని..హా..హా..

15, మార్చి 2016, మంగళవారం

పాప ని బడిలో చేర్చిన మొదటి రోజు.

పాపని 4వ ఏట  ఎల్.కె.జి. లో చేర్చాను.అప్పటికే తనకి తెలుగు వాక్యాలు రాయడం,చదవడం నేర్పేశాను.ఒక్క తప్పు దొర్లేది కాదు.సంతోషంగానే వెళ్ళింది మొదటిరోజు.టీచర్లు కూడా తన ప్రతిభ చూసి ఆనందించినట్లు చెప్పింది.
     కానీ రెండో రోజు కళ్ళలో ఉత్సాహం లేదు.ఏదో తెలియని దిగులు..నేను సహజం గా బడి అంటే ఆ వయస్సులో ఉండే అయిష్టత అనుకుని ఏం అడగలేదు.
   మూడోరోజు కూడా ముభావంగానే గడిచింది.నాలుగోరోజు జలపాతం లా పరవళ్ళు తొక్కుతూ ఎప్పటి హుషారుతో ఇంటికొచ్చింది.హమ్మయ్య అనుకున్నా.
  నేను ఏం అడగాల్సిన అవసరం లేకుండానే వస్తూనే సంతోషంగా చెప్పింది....నేను ఏ మాత్రం ఊహించని కోణం .."అమ్మా! నాకు వాష్ రూం ఎక్కడుందో కనిపించింది.కూ..చుక్..చుక్..ఆటాడించారు.అప్పుడు బడి చుట్టూ తిరుగుతుంటే ఒక చోట కనిపించింది."
    అప్పుడు నవ్వుకున్నా..తర్వాత అనిపించింది.మనం ఎంతో  ఆశిస్తున్నాం.మరి వారి కనీస భయాలను,అవసరాలను గుర్తించగలుగుతున్నామా?? అని.అప్పటి నుండి ఏ కొత్త లోకం తనకి పరిచయం కాబోతున్నా అన్ని కోణాలలో ముందే అవగాహన కల్పించుకుంటున్నా.

14, మార్చి 2016, సోమవారం

బాధగా ఉంది.ఎందుకో బాగా గుర్తొస్తున్నాడు.

నా దగ్గర 4వ తరగతి చదివే బూసం వెంకటేశ్వర రావు అనే పిల్లవాడు ఒక రోజు(తెలుగు పదజాలం,సృజనాత్మకత పెంచే ప్రయత్నం లో భాగంగా మాట్లాడిస్తుంటే..)ఒక కథ చెప్పాడు.బాగుందనిపించి ఇలా కాగితం పై  రూపమిచ్చా..కొంతకాలానికి కృష్ణాతరంగాలు పత్రిక కు పంపగా ప్రచురితమైంది. అప్పటికే నేను పెడన నుండి బంటుమిల్లి మేథ్స్ అసిస్టెంట్  గా ప్రమోషన్ పై వెళ్ళిపోయా.5సంవత్సరాలు దాచిన కథను సమయం చూసి ప్రభుత్వ బాలల మాసపత్రిక ప్రారంభింపబడగానే పంపాను.
నా లెక్క ప్రకారం ఆ పిల్లవాడు 9వ తరగతి కి వచ్చి ఉండాలి.
ఇలా అంచనా వేసుకుని..పుస్తకం తీసుకుని పెడన హైస్కూలు కు వెళ్ళా.
ఆ ముద్దు మాటల పొట్టి బాలుడిని వెతికా.
నన్ను చూసి నా చుట్టూ మూగిన అతడి తోటి నా పూర్వ విద్యార్ధులను అడిగా.
అతడు మరణించాడనే వార్త విని తల్లడిల్లిపోయా.రైలు ప్రమాదమట.
కాళ్ళీడ్చుకుంటూ తిరుగు ప్రయాణమైన నాకు ఆ క్షణం లో ఆ పుస్తకం కొండ రాయి లా చాలా భారంగా తోచింది.
    ఎందుకో ఈ రోజు వాడు బాగా గుర్తొస్తున్నాడు.ఉపశమనం కోసం ఇలా .............
ప్రయాణాలలో సామానే కాదు..మీ బిడ్డలు కూడా జాగ్రత్త.