24, మార్చి 2016, గురువారం

స్మృతి హారతి (ఎలిజీ)

స్మృతి హారతి (ఎలిజీ)
రాళ్ళబండి కవితాప్రసాద్ కు కవితాంజలి.
కంప్యూటర్ యుగం కాదిది రాతి యుగమే.."రాళ్ళ"బండి యుగమే.
మీ పేరు లోనే కవి ని,తావి ని ఇముడ్చుకున్నారు
దోసిట్లో భూమండలం మీ "కవితా ప్రసాదం"
సాహిత్యం తోనే మీ సాన్నిహిత్యం
అక్షరాలతో అవలీలగా అవధానాటలాడుతుంటే
60 నిమిషాల్లో 360 పద్యాలు,
25 నిమిషాల్లో అవధానం పూర్తి
లాంటి వింతలతో కొత్త పుంతలతో
కొంగ్రొత్త ప్రక్రియలు స్రుష్టిస్తుంటే
ఒప్పుకోవాలి..తప్పు మాదేలే.
మా అబ్బురపు సెగ అంబరాన్నంటి
మా చప్పట్ల తప్పెట్ల మోతకి
దేవతలు అదిరి చెదిరి
శచీపతి నిద్దుర వదిలి కదిలి
ఏమా అవధాన ప్రక్రియా వైవిధ్యం!
చూడాల్సిందేనని కుతూహలపడి
అర్ధంతరంగా మిము ఆహ్వానిస్తే.. కాదనలేక
కలగంటున్న లక్ష పద్యార్చన పక్కకు పెట్టి
రాళ్ళ బాట లోని తెలుగు బండి ని నల్లేరు పై నడపాలనే
మీ ఆశయాన్ని ఆశగా మా శ్వాస లో నింపి
ఒంటరి పూలబుట్ట లా మమ్మిలనొదిలి
కోటికొమ్మల చెట్టు లా మీరిలనొదిలి...
మౌనంగా నిష్క్రమించారు.
మూగబోయింది నూరు తీగల వీణయే కాదు....మెం కూడా.
అయితేనేం..
ప్రతి సాహితీ సభ దీపశిఖ రెపరెప లోనూ
మీ ఊపిరి మాకు కనబడుతుంది.
మా రచనలతో తెలుగుని వెలిగిస్తున్నపుడు
చప్పట్ల ధ్వని లో మీ గుండె చప్పుడు మాకు వినబడుతుంది..
@గుడిపూడి రాధికా రాణి.
(బందరులో సంస్మరణ సభలో చదివిన కవిత)

2 కామెంట్‌లు:

  1. రాళ్ళబండీ గారి గురించి రాసిన మీ అక్షరాలబండి వారి ఆత్మను చేరుకునేలా చేసింది!లక్షపద్యార్చనలోని కొన్ని పద్యాలు ఇప్పటికి నాదగ్గర ఉన్నాయి.అవి నేను చాలాసార్లు విన్నాను. మీరు రాసిన ఎలిజీ అద్భుతం!!మీకు వందనాలు

    రిప్లయితొలగించండి