19, మార్చి 2016, శనివారం

ఒక అందమైన జ్ఞాపకం..

హైస్కూలు నుండి యు.పి.కి బదిలీ అయినపుడు...పెడనలో 3వ తరగతి పిల్లలకు తెలుగు చెప్పా కొన్నాళ్ళు.ఒక పాప చాలా దిగులుగా కనబడేది..ఒక్క తెలుగు అక్షరం కూడా రాదు.అందరూ హుషారుగా రాసి,చదివేస్తుంటే అలా చూస్తూ కూర్చునేది.రావడమే వారానికి ఒకటో రెండో రోజులు..అప్పుడు నేర్పుదామన్నా ఉత్సాహం చూపేది కాదు.అసలు ఏమై ఉంటుంది..
ఒక బైక్ పాడయిందంటే లోపం ఎక్కడుందో కనుగొని సరిచేయాలి..కొడితే బాగుపడుతుందా..పాపం పిల్లలూ అంతే కదా..వారు ఏం అంశం లో వెనుకబడుతున్నారో గమనించి సరిచేయాలి.
ఇదే ఉద్దేశం తో..చేరదీసి వివరాలు కనుక్కున్నాను.తల్లి చనిపోయిందట.కొత్త అమ్మ కొడుతోందని ఏడుస్తూ చెప్పింది..
 ఆ పాప కి అక్షరాలు రావాలి..చదువంటే ఇష్టం పుట్టాలి. ఏం చేయాలి??  పరిస్థితిని బట్టి పాఠం చెప్పాలి. కలంకారీ కళ నిండిన పెడనలో పిల్లలకి గ వత్తు రావాలంటే "మగ్గం" అర్ధమైనంత సులువుగా పుస్తకం లోని "అగ్గి మీద గుగ్గిలం" తెలుస్తుందా..
 ఒక ఉపాయం తోచింది.కురవని మేఘం లా దిగులుగా ఉన్న ఆ పాపని దగ్గరకు రమ్మని పిలిచా. అమ్మ పేరు అడిగా."సీత"అని  చెప్తుండగానే పిల్ల కళ్ళలో నీళ్ళు.పలక మీద  సీత అని రాసి ఇచ్చా ఎలా రాయాలో గమనింపచేస్తూ.
ఇంక చూస్కోండి..నేల మీద,బోర్డ్ మీద, గాలిలో సీత అని రాస్తూ ఉండేది.తర్వాత అమ్మ కిష్టమైన కూర..వంకాయ..అలా మెల్లిమెల్లిగా ఆ పాప చదువులోకి వెళ్ళిపోయింది..తను 5లో ఉండగా నేను మేథ్స్ ప్రమోషన్ లో వెళ్ళిపోయాను..ఇప్పుడు తను ఎదురైనా నేను గుర్తుపట్టలేను. తనకి నేను గుర్తున్నానో లేదో కూడా తెలీదు.కానీ ఆ శ్రమని,అది మిగిల్చిన తృప్తిని మర్చిపోలేను.  

1 కామెంట్‌:

  1. శ్రద్ధతో తన స్థానం విలువ తెలుసుకునే ఉపాధ్యాయులకు త్రుప్తి నిచ్చేది తన శిష్యులని ప్రయోజకులుగా చూసినపుడే.

    రిప్లయితొలగించండి