17, మార్చి 2016, గురువారం

నా బాల్యం నుండి ఒక జ్ఞాపకం..

ప్రభుత్వ పాఠశాల లో 3వ తరగతి నుండి ఇంగ్లీష్ అక్షరాలు నేర్పేవారు అప్పట్లో. 1,2 తరగతులలో తెలుగు,గణితం,పరిసరాల విజ్ఞానం..అంతే.కానీ అప్పటివరకు ఆగకుండా మా అమ్మ నా 5వ ఏటనే ఎ,బి,సి,డి  లు నేర్పింది.ఏం నేర్చుకుంటున్నానో, ఎందుకు నేర్చుకుంటున్నానొ మాత్రం తెలీదు.
  మొత్తానికి 3/4 రోజులకి అన్ని అక్షరాలూ వచ్చేశాయి.వరుసగా రాయడమే కాక అడిగిన అక్షరం రాసి చూపడం తో సహా. ఆ ఆదివారం నాన్న ముందు ప్రతిభా ప్రదర్శన కు రంగం సిద్దం చేసింది.నాన్న పెన్ను,ఒక పేపర్ ఇచ్చింది.ఎప్పుడూ పలక పైన బలపంతో రాసే నాకు ఇక ఒకటే సంబరం.
    టకటకా కోరుకున్న అక్షరం రాసి చూపిస్తున్నా.అన్నయ్య,అక్క,నాన్న పక్కింటి కుసుమక్క ...ఇలా.
 లాభం ఏమిటొ ఈ అక్షరాలు ఎందుకు రావాలో మాత్రం తెలీట్లేదు.
  అప్పుడు అమ్మ అంది...పి రాయి అని..రాశా.పక్కనే యి ఆ పక్కనే ఎన్ కూడా రాయమంటే రాశా." ఇలా అక్షరాలు కలిపితే తెలుగు లో లాగే ఇంగ్లీష్ లో కూడా మాటలు అవుతాయి..ఇప్పుడు నువ్ రాసిందేమిటో తెలుసా? "పెన్". నీ చేతిలో ఉన్నది.ఆ పేరు నువ్వు ఇంగ్లీష్ లో రాశావు.అంది నవ్వుతూ.
  ఎంతో ఆనందం...మాటల్లో చెప్పలేను.నాకు తెలిసిన వస్తువు ను నేను ఒక కొత్తభాష లో రాశా.
  గంతులేస్తూ అందరికీ ఏం చెప్పానో తల్చుకుంటే ఇప్పుడు నాకు నవ్వొస్తుంది...అప్పుడు వాళ్ళు నవ్వారనుకోండి.
 ఇంతకీ అమాయకంగా ఏం చెప్పానో చెప్పలేదు కదూ..      "నాకు ఇంగ్లీష్ వచ్చేసిందోచ్..."  అని..హా..హా..

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి