11, అక్టోబర్ 2015, ఆదివారం

ఒక మాట..మంచి సందేశాలు విన్నానీ రోజు.

 కొన్ని గంటల క్రితం(10/10/15) కృష్ణాజిల్లా రచయితల సంఘం 2014,2015సంవత్సరాల సాహితీ పురస్కారాల ప్రదానసభ విజయవాడ,హోటల్ ఐలాపురం ఎ.సి.సెమినార్ హాల్ లో కన్నుల పండువగా జరిగింది.
వేదిక పై ఉన్న మహామహులను చూడటానికి ఒళ్ళంతా కళ్ళై,వారు మాట్లాడుతుంటే ఒళ్ళంతా చెవులై..ఆ మాటల్లో కొన్ని ఆణిముత్యాలు మీతో పంచుకొన మనసై..
"వ్యక్తి కి బహువచనం శక్తి"అంటూ నవ్వుల పువ్వులు పూయిస్తూనే ఆలోచనలు రేకెత్తించిన శ్రీ గొల్లపూడి మారుతీ రావు,
దేశానికి ఇండిపెండెన్స్ వచ్చింది అంటాం గానీ ఇండిపెండెంట్ వచ్చింది అనం కదా..అలా..దేశానికి స్వతంత్రం వచ్చింది అనరాదు ..స్వర్ణకారులు,చిత్రకారులు లాగా మత్స్యకారులు అనరాదు.అంటూ శ్రీ రవ్వా శ్రీహరి..సూర్యరాయాంధ్ర నిఘంటువు లో లేని పదాలు కూర్చి 1000 పేజీల నిఘంటువు వేశారీయన.వీరు గ్రామర్ కే గ్లామర్ అద్దారు వంటి అద్భుతమైన అనుసంధానాలతో సభాధ్యక్షత వహించారు శ్రీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్.
 కవిత రాయడమంటే ఇంతకాలం బతికిన బతుకంతా మళ్ళీ ఒకసారి బతకాలనిపించడమంటూ శ్రీ వాడ్రేవు చిన వీరభద్రుడు ..కవిత్వం నా కనురెప్పలపై వాలిన కమ్మని కల..నేలని చీల్చుకుని అంకురం వచ్చినపుడు..తప్పిపోయిన బిడ్డ తిరిగి వచ్చినంత సంబరం.అంటూ శ్రీ రాధేయ ఒళ్ళు పులకరింపజేశారు.
"విజయవాడ కో సాహిత్యకిరీటం కృష్ణాజిల్లా రచయితల సంఘం" అంటూ శ్రీ అప్పలనాయుడు అలరిస్తే డి.కామేశ్వరి గారు రచయితల సమస్యలను సున్నితంగా ప్రస్తావించారు.
జ్ఞానం పెట్టుబడి తక్కువ..లోకజ్ఞానం పెట్టుబడి ఎక్కువ ప్రస్తుత కాలంలో అంటూ శ్రీ సి.రాఘవాచారి ఆలోచింపజేస్తే చివరగా శ్రీ వీరాజీ గారు "చివరకు మిగిలేది..నేనే" అని నవ్విస్తూ ఆరంభించి.."ఆంధ్రపత్రిక సంపాదకునిగా నా సంపాదన ఇప్పుడు కనబడింది..మీ అభిమానం రూపంలో ..అల ఒడ్డు కు వస్తే కేరింతలతో ఆనందిస్తాం..కనీ అది పడే సంఘర్షణ,సంక్షోభం మనకి తెలీవు."అంటూ హృద్యమైన ప్రసంగంతో మనసు కు తడి చేశారు.
ఆంధ్రపత్రిక శతజయంత్యుత్సవాలను ఈ సంవత్సరం జరుపుకుందాం అని మండలి బుద్దప్రసాద్ గారు ప్రకటించారు.
ఈ అద్భుతమైన సభలో పాల్గొనడమే కాక డా.తుర్లపాటి రాజేస్వరి గారి సన్మానపత్రం చదివే అవకాశం కల్పించిన కృష్ణాజిల్లా రచయితల సంఘం అధ్యక్షులు శ్రీ గుత్తికొండ సుబ్బారావు,ప్రధాన కార్యదర్శి డా.జి.వి.పూర్ణచంద్ గార్లకు నా ధన్యవాదాలు.
                                 

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి