12, మార్చి 2020, గురువారం

"అవినీతిపై అక్షరాయుధం " 63మంది కవితల సంకలనంలో 50వ పేజీలో నా కవిత.."ఒక్కసారి ఆలోచించు".

**ఒక్కసారి ఆలోచించు.**
*********************
అవినీతి అలుముకుందనీ,దేశమిలా నాశనమైందనీ
దిగులుపడేముందు ఒక్కసారి ఆలోచించు!
దుడ్డు ఇవ్వనిదే బొడ్డు కోయదనీ,
పైసలివ్వందే పాడె కట్టడనీ,
రొక్కమివ్వందే లెక్క తేల్చరనీ,
సంతోషపెట్టందే సంతకం పెట్టరనీ
సణిగే,గొణిగేముందు ఒక్కసారి ఆలోచించు!
పేవ్ మెంట్ మీద పడతి పెనుగులాటని
వాట్సాప్లో పెట్టాలని ఉరకలెత్తేముందు,
అవబోయే అనర్ధమేదో ఒక్కసారిగా ఆగిపోతే
రోజంతా నంజుకోవడానికి మసాలా మిస్సయిందని
నిరాశ చెందేముందు ఒక్కసారి ఆలోచించు!
చంపుకున్న చుట్టాల్నీ,నీచపు చేతల్నీ,
కీచక గురువుల్నీ,మృగ్యమయే మానవతనీ
వార్తలంటే ఇంతేననుకునేలా
రోజంతా చూపిస్తుంటే
మసాలా టీ తాగుతూ దేశమిక మారదంటూ
నిట్టూర్పుల స్టేట్మెంట్లిచ్చేముందు ఒక్కసారి ఆలోచించు!
చేరదీసి చక్కని పౌరులుగా దిద్దే గురువులను,
కసురుకోక విసుగులేక విధులు చేసే ఉద్యోగుల్నీ,
స్ఫూర్తినిచ్చే ఆవిష్కరణల చిన్నారులనీ,
నీతినలా బతికుంచే నిజాయితీపరుల్నీ
బ్రేకింగ్ న్యూస్ గా ఎందుకు చూపరో ఒక్కసారి ఆలోచించు!
సానుకూల విషయాలే మన కబుర్ల విత్తులయితే
అంతటా అనుకూలమైన అభివృద్ది వృక్షచ్చాయన
ఎల్లరం చల్లగా నిలువగలమని... ఒక్కసారి నమ్మి చూడు!
************************************************************
గుదిపూడి రాధికారాణి,
మచిలీపట్నం.
No photo description available.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి