16, మార్చి 2020, సోమవారం

అమ్మ నాన్న ఓ కవిత సంకలనం లో ప్రచురితం .



మార్గదర్శి మా నాన్న**
-గుడిపూడి రాధికారాణి.మచిలీపట్నం.
*******************************************
మళ్ళీ ఆడపిల్లేనా?
మూకంతా మూతి విరిచినా
మూర్ఖించకుండా మురిసిపోయింది
మానాన్నొక్కడే
పొత్తిళ్ళలో పసిగుడ్డుగా
పొదివిపట్టుకోవడం చేతకాక
తన వేలును నా గుప్పిట్లో దూర్చి
తనివితీరా నన్నుచూసి
కళ్ళలో కాంతులు నింపుకుని
తన చేతిస్పర్శ నా మనసుకు తెలిసేలా
నా భవితకు భరోసానీ,భద్రతనీ
ఆర్ద్రంగా వర్షించిన కారుణ్య మేఘం...మా నాన్న.
నాలుగో ఏటనే నాకు చదవటం నేర్పేసి
తన పెళ్ళినాటి నుండి కొనిదాచిన
చందమామల్ని నేను చదివేస్తుంటే
ముద్ద ముట్టక్కర్లేదిక అని
మురిసిపోయిన మెరుపుతునక...మా నాన్న.
ఎడమచేత్తో రాసే నన్ను
పురచేతివాటం అని అంతా హేళన చేస్తుంటే
గెలిచిన రోజు ఈ సమాజమే
నీ సంతకం కోసం చేయి చాపుతుందని
ఊరడించిన మార్గదర్శి...మా నాన్న.
ఆనాడు నా ముద్దుమాటలకు,ముత్యాలరాతకు
నాన్న మురిసిపోవడం నాకు గుర్తులేదు.
ఈనాడు నా ప్రసంగాలు,సాహితీ ఉన్నతులు
చూపి మురిసిపోదామంటే నాన్న లేరు.
అయితేనేం...నా రచనలకు
మీ చప్పట్లతో నాన్న నా వీపు తట్టినట్లు
మీ మెచ్చుకోళ్ళలో నాన్న కళ్ళు మెరిసినట్లు
ఇప్పటికీ నాన్న వేలుని నా గుప్పిట్లో పదిలంగా పట్టుకున్నట్లు
ఆ ఊహయే నా కలమును కదిలించేస్తున్నట్లు...
అంతే మరి...
భావనలే కదా బతుకు బండి ఇంధనాలు...
******************************************
అమ్మ నాన్న ఓ కవిత సంకలనం లో ప్రచురితం .
I LoVE YOU నాన్న ..I MISS YOU..

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి