16, మార్చి 2020, సోమవారం

శ్రీ వెంకటేశ్వర వెభవం లో నా కవిత "శ్రీవారికొక లేఖా కుసుమం "



రవీంద్రభారతిలో తెలుగు భాషా చైతన్య సమితి వారి ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర వెభవం పుస్తకావిష్కరణ కార్యక్రమం మఱియు కవిసమ్మేళనము జరిగింది. అందులో నా కవిత "శ్రీవారికొక లేఖా కుసుమం " ప్రచురితమయింది.
శ్రీవారి పాదపద్మముల చెంతకొక లేఖా కుసుమం..
***********************************
ధరలను ధరణిని దాటనీకుమా ధరణీనాయకా!
అతివకు ఆదరణ అందనీయుమా వజ్రకవచధారీ!

బాలల అపహరణ అడ్డుకోవయా ఆపన్నివారణా!
అవయవాల తస్కరణ ఆపవయా అనాధరక్షకా!

నరులను తరువుల నరకనీకుమా తులసీవనమాలీ!
నీటిబొట్టుకై కన్నీటిబొట్టు విడువనీకు నీలమేఘశ్యామా!

కాలుష్యకోరలను పెకలించి మము కావుమా కరుణాసాగరా!
మానవులలో దానవతను దునుమాడుమా దశముఖ మర్దనా!

కావరము కలవారి కన్నులను తెరిపించు కమల దళాక్షా!
తాతబామ్మలతోటి తిరిగేటి వరమొసగు తిరుమలవాసా!

బతుకులో యాంత్రికతను ఇకనైన తొలగించు బ్రహ్మాండ రూపా!
వసుధలో వసంతమే వాడిపోనీకయా వసుదేవతనయా!

మనిషిలో మమతలే మాసిపోనీకయా మత్స్యావతారా!
అక్షరమె సుమముగా అర్చించినానయా ఆద్యంతరహితా!

అందరికి అండవై ఆదుకొనరావయా అభయహస్త ప్రదర్శకా!
దీనులకు దీపమై బాధితుల బాసటగు పరమదయాళో!

శేషమగు జీవితమె శాంతముగ సాగనీ శేషాద్రినిలయా!
*******************
గుడిపూడి రాధికారాణి,
మచిలీపట్నం,కృష్ణాజిల్లా.
No photo description available.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి